హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల గ్రామీణ డాక్ సేవక్‌లుగా పనిచేసేందుకు గాను ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి తెలంగాణ పోస్టల్ సర్కిల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించేందుకు ఈ నెల 26వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీస వయస్సు 18 ఉండాలి. గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉండవచ్చు. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండడంతోపాటు తెలుగును ఏదో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ కింద చదివి ఉండాలి. దరఖాస్తులకు రూ.100 ఫీజుగా నిర్ణయించారు. ఎస్‌సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్ వుమన్ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.appost.in/gdsonline అనే సైట్ లేదా www.indiapost.gov.in అనే సైట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.