పేదోడికి ‘డబుల్’ సంతోషం

  • సెప్టెంబర్ 2న సాకారం కానున్న సొంతింటి కల
  • పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక
  • ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రాలో 500 మంది ఎంపిక
  • అర్హులందరికీ దశలవారికి డబుల్ ఇండ్లు అందజేస్తాం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పేదల సొంతింటి కల నెరవేరనున్నది. రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వారి సొంతం కానున్నాయి. మొదటి విడతలో నియోజకవర్గానికి 500 చొప్పున నాలుగు (శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం) నియోజకవర్గాలకు సంబంధించి 2000 మందికి డబుల్ బెడ్ ఇండ్లు అందజేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక పథకాలలో ఒకటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో .. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చి, వారు ఆత్మగౌరవంతో గొప్పగా జీవించేందుకు సకల సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అంజయ్య యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదల సొంతం కానున్నాయని, మొదటి విడతలో 500 మంది లబ్దిదారులకు కేటాయించినట్లు తెలిపారు. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు.

శేరిలింగంపల్లి 2910, రాజేంద్రనగర్ 4166, ఎల్బీనగర్ 4752, మహేశ్వరం 651, మొత్తం 12479 దరఖాస్తులను పరిశీలించి మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 2 వేల మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. మిగిలిన వారికి విడతల వారిగా కేటాయించనున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా స్థలం ఉన్న వారు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షలు రూపాయలు పొంది ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్.ఐ.సి సహకారంతో ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేశామన్నారు. ఈ కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా ఈ సాఫ్ట్ వేర్ నిబద్దతతో కూడిన ప్రక్రియగా భావించ వచ్చని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే లబ్ది దారుల ఎంపిక ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జరిగిందన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here