సైబర్ నేరగాళ్ల మోసానికి బలైన అమాయకులు
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల అమాయకత్వమే వారి పెట్టుబడి. సాంకేతికతపై ఉన్న అవగాహనే వారి శ్రమ. కూర్చున్న చోటే ఒళ్లు వంచకుండా లక్షలు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ప్రతీ రంగం డిజిటలైజ్ అవుతోంది. ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే వారిలో సగానికి పైగా పూర్తి అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్లకు కలిసొస్తోంది. ఇంకేముంది అమాయక ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.
సోఫా కొంటానని చెప్పి…
చందానగర్ ప్రాంతానికి చెందిన జోసెఫ్ అంగర్ తన సోఫాను అమ్మాలని ఓఎల్ఎక్స్ సైట్లో ప్రకటన పెట్టాడు. 9090094860 నెంబరు నుండి ఓ వ్యక్తి సోఫాను రూ.15 వేలకు కొంటానని నమ్మించాడు. ఈ క్రమంలోనే తాను ఒక క్యూఆర్ కోడ్ పంపుతానని ఆ నెంబరుకు డబ్బులు పంపితే రెట్టింపు వస్తాయని చెప్పగా నిజమని నమ్మిన జోసెఫ్ రూ. 1, 2, 5, ,10 పంపి చూడగా రెట్టింపు డబ్బులు తిరిగి అతని ఖాతాలో జమ అయ్యాయి. దీంతో ఎక్కు వ మొత్తంలో డబ్బు పంపాలని నిర్ణయించుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.20 వేలు పంపగా డబ్బులు తిరిగి రాలేదు. ఈ విషయమై సదరు వ్యక్తిని ప్రశ్నించగా రూ.5 వేలు పంపితే మొత్తం డబ్బు తిరిగి వస్తుందని చెప్పగా జోసెఫ్ అదేవిధంగా చేశాడు. ఎంతకీ తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసాపోయానని గ్రహించిన జోసెఫ్ చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు.
కెవైసి అప్‌డేట్ అంటూ…
డోయన్స్ కాలనీకి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డికి ఓ గుర్తు తెలియని నెంబరు నుండి ఓ వ్యక్తి ఫోన్ చేసి కస్టమర్ కేర్ సెంటర్ నుండి మాట్లాడుతున్నానని కెవైసి అప్‌డేట్ చేసుకోవాలంటూ సూచించాడు. సదరు వ్యక్తి పంపిన లింకును తెరిచిన శ్రీనివాసరెడ్డి ఫోన్లో క్విక్ సపోర్ట్ యాప్ ఇన్‌స్టాల్ అయ్యింది. మరో లింకును పంపిన సదరు వ్యక్తి రూ. 32 తో రిచార్జ్ చేస్తే అప్‌డేట్ పూర్తవుతుందని చెప్పగా నిజమని నమ్మిన శ్రీనివాసరెడ్డి తన ఎటియం కార్డు సహాయంతో రిచార్జ్ చేయగా ఖాతా నుండి రూ. 39999 డెబిట్ అయినట్లు గుర్తించాడు. దీంతో మోసాన్ని గ్రహించిన ఆయన చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు.