ఆధ్యాత్మికం(నమస్తే శేరిలింగంపల్లి): హిందూ సమాజం ప్రతి సంవత్సరం గొప్పగా జరుపుకునే పండుగలలో విజయదశమ(దసరా) పండుగ అత్యంత ప్రాచుర్యం కలిగి ఉంది. అధర్మం మీద ధర్మం, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి.
విజయదశమి పండుగ వెనుక అనేక పురాణ ఇతిహాస చారిత్రక నేపథ్యాలు ఉన్నప్పటికీ చాలామందికి దసరా పండుగ అనగానే గుర్తుకు వచ్చేది రావణ దహనం/ లంకాదహనం. అయితే రావణుడి గురించి చాలా మందికి తెలియని విషయాలు అనేకం దాగి ఉన్నాయి. నిజానికి రావణుడికి పది తలలు ఉండేవా..? చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. ప్రతి సంవత్సరం రావణుడి బొమ్మను ఎందుకు దహనం చేస్తారు…? ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రావణుడికి గల మరొక పేరు దశకంఠుడు అంటే పది కంఠములు, శిరస్సులు కలిగిన వాడు అని అర్థం. అయితే శాస్త్రాలలో పురాణాలలో తెలిపిన చాలా విషయాలను శబ్ద ప్రమాణ కంగా అర్థం చేసుకుంటే దాని వెనుక గల అంతర్యాలను గ్రహించవచ్చు. రావణుడు బ్రహ్మజ్ఞాని, సకల వేదాలు శాస్త్రాలను అవపోసన పట్టిన గొప్ప పండితుడు. ఆయన నాలుగు వేదాలు, కావ్య, వ్యాకరణ, రాజనీతి, ఆయుర్వేద, శిల్ప, గాంధర్వ తదితర ఆరు శాస్త్రాలు సాంగోపాంగంగా కంఠస్థం చేశాడు. ఈ పదింటిలో నిష్ణాతుడు అయ్యాడు కాబట్టే ఆయన దశకంఠుడు అయ్యాడు. పదిమంది జ్ఞానుల తో సమానమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు దశకంఠ రావణుడు అనే పేరు వచ్చింది. శ్రీలంక దేశంలో ఇప్పటికీ రావణుడిని పూజిస్తారు అంటే ఆయన గల ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక లంకాదహన విషయానికి వస్తే నేటి సమాజంలో పండుగలప్పుడు జరిపే వినోద కార్యక్రమం గానే చాలామంది దీనిని భావిస్తారు. అయితే రావణ దహనం వెనుక గొప్ప అంతరార్థం ఉన్నదన్న విషయం చాలామందికి తెలియదు. లక్షల సంవత్సరాల క్రితం గతించిన రావణుడి ప్రతిమను దహనం చేసే ఈ కార్యక్రమం నుండి ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలనేది అసలైన ఉద్దేశం. నేటి కలియుగంలో ప్రతి మనిషిలోనూ రావణుడు ఉన్నాడు. రావణుడు అంటే మనలోని దుర్గుణాలకు ప్రతీకగా భావించి ప్రతి సంవత్సరం నిర్వహించే రావణ దహన కార్యక్రమం నుండి ప్రేరణ పొంది మనలోని దుర్వ్యసనాలు దుర్గుణాలను విడిచి పెట్టాలన్నది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. జీవితంలో లో ఎన్ని గొప్ప విజయాలు సాధించినప్పటికీ అజ్ఞానం, అహంకారం తో చేసే చిన్న పొరపాటు అయినా నా జీవితాన్ని ఉచ్చ స్థాయి నుండి అధమ స్థాయికి తీసుకువెళుతుంది అనేది రావణుడి జీవితం నుంచి గ్రహించాల్సిన సందేశం.