- తమపై వేధింపులు ఆపాలంటూ మియాపూర్ సిఆర్‌పిఎఫ్ క్యాంపు ముందు ధర్నా
నమస్తే శేరిలింగంపల్లి: తమ బస్తీలో చిన్న చిన్న పనులను సైతం చేసుకోనివ్వకుండా సిఆర్‌పిఎఫ్ సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారని, తమ కష్టాలను తీరుస్తారని ఎన్నుకున్న నాయకులు తమకు వెన్నుపోటు పొడిచారంటూ మియాపూర్ నడిగడ్డ తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మియాపూర్ లోని సిఆర్‌పిఎఫ్ క్యాంపు ముందు బస్తీవాసులు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బస్తీవాసులు మాట్లాడుతూ నడిగడ్డ తండాలో స్థానికులు గత యాభై సంవత్సరాల నుండి స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. 2016 సంవత్సరం నుండి సీఆర్పీఎఫ్ సిబ్బంది బస్తీ ప్రాంగణంలో క్యాంపు ఏర్పాటు చేసుకుని స్థానికులు ఇండ్లను మరమ్మత్తు చేసుకుంటుంటే నిర్మాణ సామాగ్రి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని, బస్తీలో వీధి వీధి తిరుగుతూ బంజార వాసులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. నిత్యవసర వస్తువులు తీసుకువెళ్తున్నా తనిఖీలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సిబ్బంది తీరును నిరసిస్తూ సీఆర్పీఎఫ్ క్యాంపు ముందు బస్తీవాసులంతా ధర్నా చేపడుతున్నామన్నారు. ధర్నాలో పాల్గొన్న ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు వైద్యం విద్య ఉచితంగా ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత యాభై సంవత్సరాల నుండి నివాసముంటున్న తండావాసుల సమస్య మాత్రం పరిష్కరించుటకు విఫలమైందన్నారు. స్థానిక శాస నసభ, కార్పోరేటర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లు ఇండ్లను క్రమబద్దీకరిస్తామని, సీఆర్పీఎఫ్ సిబ్బందితో సమస్య పరిష్కరించి బస్తీ అభివృద్దికి పాటుపడతామంటూ వాగ్దానాలు చేశారని అన్నారు. బస్తీవాసులతో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి ఓట్లు వేయించుకొని ఎన్నికలు అయిపోగానే తమకేమీ సంబంధమూ లేదన్నట్లు బస్తీవాసులను నమ్మించి మోసం చేశారని తెలిపారు. తాండా వాసులపై సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉసిగొల్పితే ఊరుకునేది లేదని, ప్రజా ఉద్యమానికైనా సిద్దమని హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న చందానగర్ ఇన్స్‌పెక్టర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో, ఎస్సై లింగ్యానాయక్ లు ఘటన స్థలానికి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ధర్నాను విరమించారు. సిఆర్ పిఎప్ సిబ్బంది దౌర్జన్యాలపై నిరసన తెలిపేందుకు ధర్నాలో పాల్గొన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి సొమ్మసిల్లి పడి పోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ నాయకులు తుకారంనాయక్ పల్లె మురళి బిజెపి నాయకులు మాణిక్రావు, రాహుల్ ఎఐబిఎస్ఎస్ నాయకులు దశరథ్ నాయక్, తాండా అధ్యక్షులు తిరుపతినాయక్, కార్యదర్శి రత్నకుమార్, చందు, రెడ్యానాయక్, శంకర్ నాయక్, సీతారాంనాయక్, లక్ష్మణ్ నాయక్, గోపీ నాయక్, శ్రీనునాయక్, హన్మానాయక్, లక్పతి నాయక్, రాఘవేందర్, ఆంజనేయులు, టిఆర్ఎస్ ఎస్‌టి సెల్ అధ్యక్షులు స్వామి నాయక్, కృష్ణ నాయక్, రవి కుమార్, అబ్రహం, హనుమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.