శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): రైలు ప్రయాణికులపైకి మద్యం సీసాలను విసురుతూ భీభత్సం సృష్టిస్తున్న కొందరు యువకులను మందలించినందుకు గాను వారు మరో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ లోని ప్రేమ్ నగర్ బి బ్లాక్‌కు చెందిన ఉపాధ్యాయుడు ఇరుగవిండ్ల సాయి, మదీనాగూడ హేమదుర్గ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన సీహెచ్ సాయి స్నేహితులు. వీరు ఈ నెల 14వ తేదీన సాయంత్రం 6.30 గంటల సమయంలో మియాపూర్‌లోని సీబీఎన్ ఎస్టేట్ వద్ద ఉన్న పెద్దమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని అనంతరం తమ ద్విచక్ర వాహనం (టీఎస్07ఈఏ0793)పై పక్కనే ఉన్న ట్రెయిన్ ట్రాక్‌కు సమీపం నుంచి ప్రయాణం చేస్తున్నారు. అక్కడే రైల్వేట్రాక్ పై 20 మంది యువకులు మద్యం సేవిస్తూ సీసాలను అటుగా వస్తున్న రైళ్లలోని ప్రయాణికులపైకి విసరసాగారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన సాయి, సీహెచ్ సాయి అలా చేయవద్దని ఆ యువకులను వారించారు.
అయితే మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆ ఇద్దరు చెప్పిన మాటలను పట్టించుకోకపోగా వారిపై దాడి చేస్తూ వారిని వెంబడించారు. ఈ క్రమంలోనే సాయి, సీహెచ్ సాయిలను పట్టుకుని వారి నుంచి బంగారు చెయిన్, ఐఫోన్ తోపాటు ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారు. దీంతో హడలెత్తిపోయిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారు చందానగర్‌లోని శాంతినగర్ ప్రాంతానికి చెందిన వారు కాగా ఒక యువకున్ని వడ్డే ప్రభుదాస్ (25)గా గుర్తించారు. అతను డ్రైవర్ కాగా మరో యువకుడు గుంజె శ్రీనాథ్ (19) డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడని, ఇంకో యువకుడు పూసాల వెంకటేష్ (20) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.





