శేరిలింగంపల్లి, మార్చి 12 (నమస్తే శేరిలింగంపల్లి): అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరుకు చెందిన జి.సిద్ధు, పవన్, రోహిత్ కుమార్ (24) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని ఓల్డ్ హఫీజ్‌పేటలో ఓ రూమ్‌లో అద్దెకు ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఈ నెల 10వ తేదీన సిద్ధు, పవన్ ఎప్పటిలాగే ఉదయం ఆఫీసుకి వెళ్లారు. రోహిత్ కుమార్ ఒంట్లో నలతగా ఉందని రూమ్‌లోనే ఉన్నాడు. మధ్యాహ్నం సమయంలో రోహిత్‌కు సిద్ధు ఫోన్ కాల్ చేయగా ట్యాబ్లెట్ వేసుకున్నానని, కాస్త ఫర్వాలేదని చెప్పాడు. కాగా సాయంత్రం రూమ్‌కు తిరిగి వచ్చిన సిద్ధు, పవన్ ఎంత తలుపు కొట్టినా రోహిత్ తీయలేదు. అతనికి ఫోన్ కాల్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సిద్ధు, పవన్ గది తులుపులు పగలగొట్టి చూడగా రోహిత్ కుమార్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని రోహిత్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.