శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): స‌్కూల్‌కు వెళ్లమని మందలించినందుకు గాను ఓ బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నివాసం ఉండే కె.ఈశ్వరయ్య స్థానికంగా కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని కుమారుడు కె.ప్రకాష్ (14) స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా గత 20 రోజుల నుంచి ప్రకాష్ స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తల్లి స్కూల్‌కు వెళ్లమని మందలించింది. ఈ క్రమంలోనే ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ప్రకాష్ ఆచూకీ కోసం వెదికారు. అయినా ఫలితం లేదు. దీంతో వారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రకాష్ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు గ్రీన్ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ధరించి ఉన్నాడని, అతను 5 అడుగుల ఎత్తు, చామనఛాయ రంగులో ఉంటాడని, ఎవరైనా గుర్తు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.