- మొత్తం 7 మంది, అందులో ఒకరు నైజీరియన్
- సిమ్‌లను మార్చి నగదును కాజేస్తారు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రజలకు చెందిన ఫోన్లలో ఉండే సిమ్‌లను స్వాప్ చేసి వారి నగదును కాజేస్తున్న 7 మంది సభ్యులు ఉన్న ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
గత ఏడాది జూన్ 21వ తేదీన ఓ వ్యక్తి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. కాగా అతని సిమ్ నుంచి కేవలం ఔట్ గోయింగ్ కాల్స్ మాత్రమే వెళ్తున్నాయని, ఇన్ కమింగ్ కాల్స్ రావడం లేదని తెలిసి సంబంధిత కంపెనీ జియో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో సమస్య పరిష్కారం అయింది. తరువాత అతను తన బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేందుకు యత్నించగా వీలు కాలేదు. బ్యాంక్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు మారినట్లు గుర్తించాడు. దీంతో డెబిట్ కార్డుతో ఆయా వివరాలను మార్చాడు. మరుసటి రోజు బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయి చూడగ అందులో సున్నా బ్యాలెన్స్ ఉంది. రూ.4.25 లక్షలను ఎవరో ఇతర ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించి వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అలాగే మరొక ఘటనలో గతేడాది అక్టోబర్ 25వ తేదీన ఓ వ్యక్తికి చెందిన సిమ్ కార్డును స్వాప్ చేసిన కొందరు అతని అకౌంట్ నుంచి రూ.6.75 లక్షలు కాజేశారు. అతని నంబర్‌తో సిమ్ తీసుకుని అతని అకౌంట్ ద్వారా ఆ మొత్తాన్ని కొట్టేశారు. దీంతో అతను కూడా పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి వారి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, 4 రబ్బర్ స్టాంపులు, 15 మొబైల్ ఫోన్లు, 7 లెటర్ హెడ్స్, 1 వైఫై డాంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో ఎ1గా ఉన్న జేమ్స్ అనే వ్యక్తి నైజీరియాకు చెందిన వాడు కాగా అతను, షోయబ్ షేక్ అనే మరో వ్యక్తి ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారు ముంబైకి చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లే, జమీర్ అహ్మద్ మునీర్ సయ్యద్, ఆదిల్ హసన్ అలీ సయ్యద్, జునెయిద్ అహ్మద్ షేక్, అశ్విన్ నారాయణ షేర్‌గార్ అని పోలీసులు తెలిపారు.
సిమ్ స్వాప్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. సిమ్ కార్డును మారుస్తామని, కన్వర్ట్ చేస్తామని ఎవరైనా కాల్ చేస్తే నమ్మవద్దని, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పేరిట వచ్చే మెయిల్స్, వెబ్ సైట్ లింక్‌లను ఓపెన్ చేయవద్దని, మొబైల్ నంబర్ సిగ్నల్ పోయిన వెంటనే టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించాలని, సిమ్ కార్డును వారాంతాల్లో బ్లాక్ చేస్తే వెంటనే నెట్ బ్యాంకింగ్‌కు చెందిన పాస్‌వర్డ్‌లను మార్చేయాలని, తరచూ ఈ-మెయిల్, నెట్ బ్యాంకింగ్‌లకు చెందిన పాస్ వర్డ్‌లను మార్చాలని, బ్యాంకింగ్ సేవలకు, వ్యక్తిగత కాల్స్‌కు వేర్వేరు నంబర్లను ఉపయోగిస్తే శ్రేయస్కరం అని పోలీసులు హెచ్చరించారు.