విద్యుత్ వైర్ల‌ను దొంగిలిస్తున్న వ్య‌క్తుల అరెస్టు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నిర్మాణంలో ఉన్న భవనాలే లక్ష్యంగా విద్యుత్ వైర్ల దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన దిలీప్ కుమార్, హఫీజ్ పేటలో నివాసముంటున్న నిశాల్ కరల్కర్ స్నేహితులు. కాగా వీరు జ‌ల్సాల కోసం దొంగతనాలు చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌గా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని దొంగ‌త‌నాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. నిందితులు మొదట పగటిపూట నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద రెక్కీ నిర్వహించేవారు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో కారులో వెళ్లి భవనాల్లో నిల్వ చేసిన విద్యుత్ వైర్ల బెండ‌ల్స్‌ను దొంగిలించేవారు. ఈ క్ర‌మంలో పోలీసులు వారిని చాక‌చ‌క్యంగా అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 4 లక్షల విలువైన 81 విద్యుత్ వైర్ల బెండ‌ల్స్‌ను, దొంగతనాలకు ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ కారు, బజాజ్ పల్సర్ బైకును స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులపై గతంలో అనేక కేసులు నమోద‌య్యాయ‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితుల‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు సహా మొత్తం అన్ని పోలీస్ స్టేష‌న్ల‌లోనూ 11 కేసులు ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. దొంగతనం కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవన యజమానులు తమ విలువైన వస్తువుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here