శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డ ఓ వృద్ధుడు తలకు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్‌లోని గంగారంలో ఉన్న శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న పీతల ఎల్లాజీ రావు (65) ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి చందానగర్‌లోని జేపీ సినిమా రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ రహదారిపై పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న మదీనాగూడలోని ప్రణామ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించాలని చెప్పగా అతని కుటుంబ సభ్యులు అతన్ని ఆ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎల్లాజీ రావు ఈ నెల 18వ తేదీన రాత్రి 7.41 గంటల సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అతని అవయవాలను దానం చేశారు.






