శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ హస్త కళా ఉత్సవం All India Crafts Mela ఈ నెల 20వ తేదీ నుండి శిల్పారామంలో ప్రారంభమవుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ క్రాఫ్ట్స్ ప్రేమికుల కోసం, చేనేత కళాకారుల కోసం డెవలప్మెంట్ అఫ్ కమిషనర్, మినిస్ట్రీ అఫ్ టెక్స్టైల్స్ భారత ప్రభుత్వం, నేషనల్ జ్యూట్ బోర్డు, శిల్పారామం సంయుక్త నిర్వహణలో దాదాపుగా 450 స్టాల్స్‌ను శిల్పారామంలో ఆహ్లాదకరమైన ఆవరణలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు శాస్త్రీయ , జానపద, సంగీత వాయిద్య సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ వారు సిద్ధి ఢమాల్, ఫాగ్, ఘుమార్, చౌ నృత్యం, గారడీ గొంబె, కర్గం, కావడి, సంబల్పూరి జానపద నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారని అన్నారు. హైదరాబాద్ అస్సాం అసోసియేషన్, మహారాష్ట్ర అసోసియేషన్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారతీయ కళాకారులే కాకుండా ప్రవాస భారతీయులు లండన్, దుబాయ్, కాలిఫోర్నియా, హవాయి, టెక్సాస్, ఫోనిక్స్విల్లే , హాంగ్ కాంగ్ నుండి కూడా కళాకారులు పాల్గొంటున్నారని అన్నారు. రంగు రంగు పూలతో విద్యుత్ దీపాలతో శిల్పారామం సుందరంగా తీర్చబడుతుందని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చేనేత హస్తకళాకారులను ప్రోత్సహించాలని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్ రావు కోరారు.






