శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): రోజూ పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చిత్ర హింసలకు గురి చేయడమే కాకుండా ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి జీవితకాల జైలు శిక్ష విధించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామానికి చెందిన చెల్లా నాగేశ్వర్ (45) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి బాలానగర్‌లోని ఐడీపీఎల్ ఇందిరా గాంధీ నగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా ఓ కాలేజీలో అకౌంటెంట్ కమ్ క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య సుష్మిత, కుమారుడు ఉన్నారు. కాగా నాగేశ్వర్ రావు పీకల దాకా మద్యం సేవించి రోజూ రాత్రి ఇంటికి వచ్చి భార్య సుష్మితను విపరీతంగా చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో చాలా సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా అయ్యాయి.
ఇరు వర్గాలకు చెందిన వారు ఆ దంపతులకు నచ్చజెప్పి కాపురాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నాగేశ్వర్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలోనే జూన్ 6, 2010వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో ఎప్పటిలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన నాగేశ్వర్‌కు, సుష్మితకు మధ్య గొడవ అయింది. దీంతో మద్యం మత్తులో ఉన్న నాగేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుష్మితను బలంగా నెట్టాడు. ఆ క్రమంలో ఆమె పక్కనే ఉన్న టేబుల్ పై పడి తలకు గాయం అయి వెంటనే ప్పృహ కోల్పోయింది. వెంటనే నాగేశ్వర్ పక్కనే ఉన్న కొవ్వొత్తిని ఆమెపై వేసి తన 11 నెలల కొడుకును తీసుకుని బయటకు వెళ్లాడు.
కాసేపటికి ఇంటికి వచ్చిన నాగేశ్వర్ ఏమీ తెలియనట్లు సుష్మితకు గాయాలు అయ్యాయని, ఆమెను హాస్పిటల్‌లో చేర్పించానని ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందిన సుష్మిత ఫిర్యాదు మేరకు పోలీసులు నాగేశ్వర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతను ఆమెను చిత్ర హింసలకు గురి చేసినట్లు, ఆమెను చంపాలని చూసినట్లు కూడా విచారణలో తేలడంతో కూకట్‌పల్లి 6వ అదనపు న్యాయమూర్తి అతనికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు
రూ.5000 జరిమానా, గృహ హింస నిరోధక చట్టం ఐపీసీ 498-ఎ ప్రకారం 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. ఈ మేరకు నిందితున్ని పోలీసులు జైలుకు తరలించారు.