శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): కుటుంబ కలహాలకు తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల రాంకీ వన్ గెలాక్సియా టి2 ఫ్లాట్ నం.210లో నివాసం ఉంటున్న కన్నెగుండ్ల శ్రీనివాస రావు (46) స్థానికంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కాగా ఈ నెల 27వ తేదీన ఉదయం 10.15 గంటల సమయంలో శ్రీనివాసరావు తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ పై అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న నల్లగండ్ల సిటిజెన్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీనివాస రావు ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని, బహుశా కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






