శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని చందానగర్ హుడా కాలనీలో నివాసం ఉంటున్న కసిరెడ్డి హరినాథ్ రెడ్డి స్థానికంగా ప్రైవేటు ఉద్మోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని తండ్రి కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి 7 ఏళ్ల కిందట కేరళ రాష్ట్రంలో జై కుమార్ సంతమ్మ రాజన్ బాబు అనే వ్యక్తి దగ్గర డ్రైవర్‌గా పనిచేశాడు. అదే సమయంలో రాజన్ బాబుకు పురుషోత్తం రెడ్డి రూ.13 లక్షలు అప్పు ఇచ్చాడు. తరువాత తన అప్పు తీర్చాలని రాజన్ బాబును పలు మార్లు పురుషోత్తం రెడ్డి కోరాడు. కానీ రాజన్ బాబు ఆ అప్పు తీర్చలేదు. దీంతో 3 నెలల కిందట రాజన్ బాబు వద్ద డ్రైవర్ గా ఉద్యోగం మానేసిన పురుషోత్తం రెడ్డి శేరిలింగంపల్లిలోని చందానగర్ హుడా కాలనీలో ఉంటున్న తన కుమారుడు హరినాథ్ రెడ్డి వద్దకు వచ్చి ఖాళీగా ఉంటున్నాడు. కాగా ఇతరుల వద్ద డబ్బును అప్పుగా తీసుకున్న పురుషోత్తం రెడ్డి ఆ మొత్తాన్ని రాజన్ బాబుకు అప్పుగా ఇచ్చాడు. కానీ తనకు రావల్సిన అప్పు రాకపోగా ఇతరుల వద్ద తాను తెచ్చిన అప్పు కట్టాల్సి వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పురుషోత్తం రెడ్డి ఈ నెల 26వ తేదీన సాయంత్రం 5.31 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పురుషోత్తం రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.





