శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇండ్లల్లో దొంగతనాలు, బైకు దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని చందానగర్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని కేసును ఛేదించారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేష్ (25) ఇళ్ల తాళాలను పగలగొట్టి ఇళ్లలో దొంగతనాలు చేయడంతోపాటు ద్విచక్ర వాహనాలను సైతం దొంగిలిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న భీమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను చేసిన నేరాలను అంగీకరించాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంటి దొంగతనం, 2 మోటార్ సైకిళ్ల దొంగతనానికి అతను పాల్పడ్డాడు. అలాగే దుండిగల్, మక్తల్, చైతన్యపురి, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోనూ ఇళ్ల దొంగతనాలు, బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతని నుంచి 2 మోటార్ సైకిళ్లు, 8 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు. భీమేష్ గతంలో మొత్తం 42 కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని, ఇతను 2019 నుండి దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన చందానగర్ క్రైమ్ సిబ్బందిని మాదాపూర్ డీసీపీ, మియాపూర్ ఏసీపీ అభినందించారు.







