ఆటోల్లో సంచ‌రిస్తూ మొబైల్ ఫోన్ల‌ను త‌స్క‌రిస్తున్న ముఠా అరెస్టు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆటోల‌లో సంచరిస్తూ ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాతోపాటు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్, సీఐ శివకుమార్, డీఐ రమేష్ నాయుడు విలేక‌రుల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ ఎజాజ్ (35), మీర్జా ఫారూఖ్ బేగ్ (26), సయ్యద్ సాజిద్ ( 33), మహ్మద్ అమీర్ (26), సయ్యద్ ఒమర్ (29), అబ్దుల్ నవీద్ ( 48) ల‌లో నవీద్ మినహా మిగతా వారంతా పాత నేరస్థులు. వీరు 2011 నుండి మూడు కమిషనరేట్ల పరిధిలో మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతూ వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిలో ఏ1 నుండి ఏ4 వరకు ఉన్న నేరస్థులు ఉదయం ఓల్డ్ సిటీ నుండి నంబర్ ప్లేట్ లేని ఆటోలో బయలుదేరి దారిలో వస్తున్న సమయంలో ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుంటారు. దారిలో చాకచక్యంగా సెల్ ఫోన్ ల‌ను దొంగిలిస్తారు. ఇలా ఒక్కరోజులోనే 20 నుండి 30 ఫోన్లు చోరీలకు పాల్పడేవారు.

అలా చోరీచేసిన మొబైల్ ఫోన్లను ఆబిడ్స్‌లోని జగదీష్ మార్కెట్ లో అమ్మేస్తుంటారు. 2011 నుండి 2022 వరకు చోరీలకు పాల్పడిన వీరు కొద్దిరోజులుగా చోరీలు చేయ‌డం లేదు. కానీ వీరు మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ నుండి తిరిగి చోరీల బాటపట్టారు. ఇదే క్రమంలో వీరి ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికుడు తన మొబైల్ చోరీ జరిగిందని మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు డీఐ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా తామే చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుండి 20 మొబైల్ ఫోన్లు, రూ.2.50 లక్షల నగదు, 2 స్కూటీలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. నిందితుల్లో ఏ1 మహ్మద్ అజీజ్ పై 28 కేసులు, ఏ2 మీర్జా ఫారూఖ్ బేగ్ పై 13 కేసులు, ఏ3 సయ్యద్ సాజిద్ పై 14 కేసులు, ఏ4 మహ్మద్ అమీర్ పై 2 కేసులు, ఏ5 సయ్యద్ ఒమర్ పై ఒక కేసు ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here