మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన అధికారులపై కిరోసిన్ పోసి వారిని హత్య చేసేందుకు యత్నించిన కొందరు వ్యక్తులపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
జీహెచ్ఎంసీలో విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న వంగా రోహిత్ రెడ్డి నాగోల్ లోని నాగేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా మియాపూర్ పరిధిలోని గోపాల్ రావు నగర్‌లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు రోహిత్ రెడ్డి సోమవారం ఇతర సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారు నిర్మాణాలను తొలగిస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి రోహిత్ రెడ్డితోపాటు సిబ్బంది ఒంటిపై కిరోసిన్ పోశారు. అనంతరం వారికి నిప్పు పెట్టేందుకు యత్నించారు. దీంతో సిబ్బంది ఎం.శ్రీనివాస్, భాను చందర్, కలీం, అరుణ్ కుమార్‌లు అక్కడి నుంచి పారిపోయారు. అంతరం రోహిత్ రెడ్డి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా వారిపై హత్యకు యత్నించిన వ్యక్తులు కరీం, అంజద్, అఫ్రోజ్, ఇమ్రాన్, సల్మాన్ అని రోహిత్ రెడ్డి గుర్తించారు. దీంతో మియాపూర్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.