శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాలు సమర్పించి భవన నిర్మాణ అనుమతి పొందినట్లు ఆరోపణలు రావడంతో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అనుమతిని రద్దు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదై దర్యాప్తు కొనసాగుతోంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ గ్రామం, సర్వే నంబర్ 32లోని ప్లాట్ నంబర్ 55కు సంబంధించి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి జోన్, మాదాపూర్ సర్కిల్-50 డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి అందిన ఫిర్యాదు ప్రకారం.. సదరు ప్లాట్‌కు ఫిర్యాదుదారుడి సోదరుడు అసలు యజమాని అని పేర్కొన్నారు.

అయితే షేక్ మస్తాన్ అనే వ్యక్తి సంబంధిత స్థలానికి చెందని పత్రాలను సమర్పించి, అవసరమైన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ లేకుండానే టీజీ-బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారుల పరిశీలనలో భవన నిర్మాణ అనుమతి కోసం సమర్పించిన ఎల్ఆర్ఎస్ పత్రాలు ఇతర వ్యక్తుల పేర్లతో జారీ అయినట్లు గుర్తించారు. అలాగే అవసరమైన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్‌కు బదులుగా కేవలం యూఎల్సీ అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే సమర్పించినట్లు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సంబంధిత భవన నిర్మాణ అనుమతిని మున్సిపల్ అధికారులు రద్దు చేశారు. అయితే అనుమతి రద్దయినప్పటికీ సదరు స్థలంలో నిర్మాణ పనులు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. చెల్లుబాటు అయ్యే అనుమతి లేకుండా నిర్మాణ పనులు చేపడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
నకిలీ ఎల్ఆర్ఎస్ పత్రాల సమర్పణ, అవసరమైన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ లేకుండా భవన నిర్మాణ అనుమతి పొందడం, వాస్తవాలను దాచిపెట్టి అనుమతి పొందడం, అనుమతి రద్దు అనంతరం కూడా నిర్మాణ పనులు కొనసాగించేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలపై సర్కిల్-50 డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్సై సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత పత్రాలు, ఎల్ఆర్ఎస్, యూఎల్సీ రికార్డులు, భవన నిర్మాణ అనుమతికి సమర్పించిన డాక్యుమెంట్లు, నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.





