శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 2 ఏళ్ల బాలుడు అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఫుట్‌పాత్‌పై రమేష్, బాలమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి అరుణ్ (2) అనే కుమారుడు ఉన్నాడు. కాగా ఆగస్టు 17వ తేదీన ఉదయం 6.30 గంటల సమయంలో తన కుమారున్ని తండ్రికి అప్పగించి టీ తెచ్చేందుకు బాలమ్మ బయటకు వెళ్లింది.
తిరిగి వచ్చి చూసే సరికి తన భర్త రమేష్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తూ కనిపించాడు. కానీ తన కుమారుడు లేడు. దీంతో రమేష్, బాలమ్మ ఇద్దరూ చుట్టు పక్కల విచారించారు. తెలిసిన వారిని అడిగారు. కానీ తమ కుమారుడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చందానగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా బాలుడు అదృశ్యం అయినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఉన్నాడని, ఎత్తు 2 అడుగులని, చామనఛాయ రంగులో ఉంటాడని, జుట్టు నలుపు రంగులో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరికైనా ఆ బాలుడి ఆచూకీ లభిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.