శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వృద్ధుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ మైత్రినగర్‌లో జాతీయ రహదారిపై డివైడర్ పక్కన ఓ గుర్తు తెలియని వృద్ధుడు పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఈ నెల 22వ తేదీన చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి వయస్సు సుమారుగా 70 సంవత్సరాలు ఉంటుందని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే మియాపూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.