- – 2023 సంవత్సరానికి లక్ష్యాలపై బాలానగర్ జోన్ పోలీస్ అధికారులకు సీపీ దిశా నిర్దేశం
- నేరాల నియంత్రణ, పోలీసు దర్యాప్తు తీరుతెన్నులపై సైబరాబాద్ సీపీ సమీక్షా సమావేశం
- కన్విక్షన్ల శాతాన్ని పెంచాలి: సీపీ
నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి బాలనగర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., బాలానగర్ డిసిపి ఆఫీసులో క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించి, 2023 సంవత్సరానికి గాను ఛేదించే లక్ష్యాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధి బాలానగర్ జోన్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల లో నేరాల సంఖ్యను తగ్గించే విధంగా పోలీస్ సిబ్బంది కృషి చేయాలన్నారు. ముఖ్యంగా సిపి రెండు విషయాలను స్పష్టం చేశారు. ఒకటి కన్విక్షన్లను తీసుకురావడం, రెండు సెక్టార్ ఎస్సైలు పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సెక్టార్ ఎస్ఐలది కీలకపాత్ర అన్నారు. సెక్టార్ ఎస్సైలు వారి సెక్టార్లలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. నేరాలను తగ్గించేందుకు సెక్టార్ ఎస్సైలు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్లాలన్నారు. పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ షీట్స్ ద్వారా ఎప్పటికప్పుడు సెక్టార్ ఎస్సైల పనితీరును అంచనా వేయడం జరుగుతుందన్నారు. కోర్టు పని, ఎన్ ఫోర్స్ మెంట్ పాయింట్స్ బుక్, పోలీసింగ్ కి సంబంధించిన వివిధ నైపుణ్యాలు, న్యాయ పరిజ్ఞానం, నేర పరిశోధనలో నాణ్యత, టెక్నికల్ నైపుణ్యాలు తదితర అంశాలను పరిగణంలోకి తీసుకొని సెక్టార్ ఎస్ఐలకు మార్కులు ఇచ్చి వారి పెర్ఫార్మెన్స్ ను పరిశీలిస్తున్నామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపీఎస్., చెప్పినట్లుగా 5H, 5W, TIP వంటి పద్ధతులతో ఇన్వెస్టిగేషన్లో నాణ్యతను పెంచాలన్నారు. ఇన్ స్పెక్టర్లు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలి అన్నారు. స్పష్టమైన లక్ష్యాలు, స్పష్టమైన గమ్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రతివారం లాండ్ ఆర్డర్ పై ఇన్ స్పెక్టర్లు సమీక్షలు చేయాలన్నారు. సాక్షాలను సేకరించడం, సంబంధిత జడ్జీలు మెజిస్ట్రేట్లతో సంప్రదించి త్వరితగతిన బాధితులకు న్యాయ సేవలు అందించాలన్నారు. ముఖ్యంగా పోలీసులు వారి ప్రాథమిక విధుల పైన దృష్టి సారించాలన్నారు. సంబంధిత డీసీపీలు, ఏసీపీలు ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐల పనితీరుపై పర్యవేక్షించాలన్నారు. డీసీపీలు పక్షం రోజులకు ఒకసారి, ఏసీపీలో వారానికి ఒకసారి, ఇన్ స్పెక్టర్లు, డిఐలు తరచుగా సమీక్షలు నిర్వహించుకొని నేరస్తులకు శిక్షలు పడేలా చూడాలన్నారు. సమస్యలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సెక్టార్ ఎస్ఐల పనితీరుపై తానే స్వయంగా దృష్టి సారిస్తానని సీపీ తెలిపారు.
రాష్ట్రంలోనే సైబరాబాద్ కమీషనరేట్ పరిధి బాలనగర్ జోన్ లోని చిన్న పెద్ద తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈఎస్ ప్రాంతాలు పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణ ఉన్నందున నేర నియంత్రణ, శాంతి భద్రతలను అదుపులో ఉన్నట్లయితే యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 2023 సంవత్సరానికి గాను అన్ని పోలీస్ స్టేషన్‌ల సిబ్బందికి నేర నియంత్రణలో సాధించాల్సిన లక్ష్యాలపై దిశ నిర్దేశం చేశామన్నారు. అదేవిధంగా విజిబుల్ పోలీసింగ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ పద్ధతులను అవలంబించాలన్నారు.
గస్తీ వాహనాలు ఎల్లవేళలా ప్రజా రద్దీగా ఉండే ప్రాంతాలలో, కూడళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సిబ్బంది కేసుల ఇన్వెస్టిగేషన్ లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి వారి వెన్నులో వణుకు పుట్టించేలా పోలీసింగ్ ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్ లో నమోదైన అన్ని కేసులను చట్ట ప్రకారం నాణ్యమైన పద్ధతులలో దర్యాప్తు చేసి త్వరతగతిన చార్జ్ షీట్లు వేసి కోర్టులలో దర్యాప్తు అధికారులు సమర్పించాలని ఆదేశించారు. కోర్టు అటెండెన్స్, కన్విక్షన్లు, సాక్షాల సేకరణ పై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా సెక్టార్ ఎస్ఐలు బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలన్నారు.
నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి తదనుగుణంగా పాయింట్ పుస్తకాల పునర్వ్యవస్థీకరణ చేయాలన్నారు. MO క్రిమినల్స్, హిస్టరీ షీటర్స్, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై స్థానిక SHOలు నిఘా ఉంచి వారు ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు. పీడీ యాక్ట్ ల నమోదు, సీసీటీవీల ఏర్పాటు పై దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసులను త్వరితగతిన లోక్ అదాలత్, కన్విక్షన్లు తీసుకురావాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అలాగే సిబ్బందికి అవసరమైన ఏదైనా సామగ్రి కావాలన్నా సమాచారం ఇవ్వాలన్నారు.
- ట్రాఫిక్ సమీక్ష- 2023 లక్షాలు..
రోడ్డు ప్రమాదాలను తగ్గేలా చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సిబ్బందికి సిపి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రూరల్ ప్రాంతాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ చేపట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ ల సమయంలో అవసరమైతే లాండ్ ఆర్డర్ సిబ్బంది సహకారం తీసుకోవాలన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ పనులకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్లతో భాగస్వామ్యం చేసుకొని పని చేయాలన్నారు.
- కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కు అందజేత
షామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న 2020 బ్యాచ్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ షరీఫ్ ఇటీవల విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. షరీఫ్ భార్య, అతని కుటుంబసభ్యులకు సిపి, పేట్ బషీరాబాద్ ఏసిపి రామలింగరాజు, షామీర్పేట్ ఇన్ స్పెక్టర్ సుధీర్ సమక్షంలో 25 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. పోలీస్ డిపార్ట్ మెంట్ పరంగా వారి కుటుంబ సభ్యులను ఆదుకుంటామన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్, ఐపీఎస్., క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఐపీఎస్., బాలానగర్ డిసిపి సందీప్, అడ్మిన్ డీసీపీ ఇందిరా, సీసీఎస్ ఏడీసీపీ నర్సింహా రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, డీఐ లు మరియు ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.