నమస్తే శేరిలింగంపల్లి: పలు పార్టీలలో పెత్తందార్ల వ్యవస్థ, చెంచాగిరిల రాజ్యంతో విసిగిపోయానని చందానగర్ డివిజన్ పిఏ నగర్ నాయకుడు కే చంద్రయ్య అన్నారు. నిస్వార్థంతో, నిజాయితీగా, ఎలాంటి పదవులు ఆశించకుండా పనిచేసిన గుర్తింపు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ గెలుపునకు కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కష్టపని పనిచేశానని, కానీ తగిన గుర్తింపు ఇవ్వటం లేదని, అన్యాయం జరిగిందని తెలిపారు.
మనసున్న మారాజు, ఆపదలో అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యానని, బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. అందరికీ జగదీష్ గౌడ్ తోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.
1993లో ఎంసిపిఐ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి 14 సంవత్సరాలు ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఆ తర్వాత సిపిఐ పార్టీలో చేరానని, కానీ ఆ పార్టీలో పెత్తందార్ల వల్ల రాజీనామా చేసి.. అప్పటి ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ నాయకత్వంలో కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. ఎమ్మెల్యే తో మనస్పర్ధల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శంకర్ రెడ్డి నాయకత్వంలో ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నానని తెలిపారు. అప్పటినుంచి.. ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కష్టపడ్డానని, ప్రస్తుతం చెంచాల చెప్పుడు మాటలు విని తనకు అన్యాయం చెయ్యడం పట్ల రాజీనామా చేశానని చెప్పారు.