45 రోజుల పసికందుకు అరుదైన శస్త్రచికిత్స

  • మూత్రవ్యవస్థ, వెన్నెముక, జననేంద్రియ సమస్యతో తల్లడిల్లిన శిశువు
  • యోని అట్రేసియాగా గుర్తింపు
  • 5 గంటలు శ్రమించి విజయవంతం చేసిన మాదాపూర్ మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు

నమస్తే శేరిలింగంపల్లి : 45 రోజుల పసికందుకు మాదాపూర్ మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి విజయవంతం చేశారు. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధు మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన దంపతుల శిశువు (45 రోజులు) నాలుగు రోజులగా పొత్తికడుపు వాపు, వాంతులతో బాధపడుతున్నది. దీంతో ఆ శిశువును తన తల్లిదండ్రులు మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు శిశువు మూత్ర వ్యవస్థ, వెన్నెముక సమస్యలు, జననేంద్రియ ప్రాంతంలో సమస్యలు గుర్తించారు. శిశువుకు యోని తెరవకుండా, కాళ్ల మధ్య భాగంలో ఒకే రంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీనిని యోని అట్రేసియా అంటారు. పాయువు అసాధారణ స్థితిలో ఉన్నట్లు కనుగొన్నారు.

మూత్రాశయంతో కలిపే నాళాలలో సమస్యలు ఉన్నాయని, ఫలితంగా కిడ్నీలు, మూత్ర వ్యవస్థలో వాపు ఏర్పడిందని పరీక్షల్లో తేల్చారు. వెన్నెముక అసాధారణంగా ఉండడంతో పాటు, కటిలో ద్రవం పేరుకుపోయినట్లు తెలిపారు. చిన్న కెమెరా సాయంతో మూత్రాశయం (సిస్టోస్కోపీ) పరిక్షించారు. ఆ తర్వాత లాపరోటమీ సర్జరీ చేపట్టి ఆమె యోని ప్రాంతాన్ని పునర్నిర్మాణంతో పాటు ఆమె యోని వెనుక భాగంలో కొత్త ఓపెనింగ్ (రంధ్రం) సృష్టించారు. యోనిలోపల పేరుకుపోయిన ద్రవము పూర్తిగా పొడిబారిపోయింది. ఈ అరుదైన సర్జరీకి 5 గంటల సమయం పట్టింది. శస్త్రచికిత్స విజయవంతమైంది. అనంతరం డాక్టర్ మధు మోహన్ రెడ్డి మాట్లాడుతూ పుట్టినప్పుడు కొన్ని నెలల వరకు శిశువు యోని ద్వారా ద్రవము కారిపోతుందని, ఈ పాపకు యోని రంద్రం లేనికారణంగా ద్రవము గర్భసంచిలో ఉండటం వల్ల ఆమె పొట్ట భాగము పెద్దగా అయ్యి కడుపులో నొప్పి పలు సమస్యలతో పాప ఇబ్బంది పడిందన్నారు. సర్జరీ గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి సహకారంతో శస్త్ర చికిత్స నిర్వహించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోనోటాలజీ & పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ రవీందర్ రెడ్డి, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ మధు మోహన్ రెడ్డి , సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి , సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి , అనస్థీషియాలజీ విభాగం డాక్టర్ సంధ్య, హర్షిత పాల్గొన్నారు .

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here