తెరచుకొనున్న సినిమా హాల్స్..జనాలు వస్తారంటారా..?

ఈ నెల 15వ తేదీ నుండి సినిమాహాల్స్ తెరచుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఎంత మంది సినిమా హాల్స్ కి వచ్చి సినిమా ని చూస్తారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సినిమా హాల్స్ కి వెళ్ళి సినిమా చూడడం అంటే అన్ని వయస్కుల వారికి అదొక సరదా. కొత్త సినిమా విడుదల అయిందంటే చాలు అందరి కన్నా ముందు చూడాలన్న ఆతృత. పెద్ద స్క్రీన్ మీద మన అభిమాన హీరో సినిమా చూడటం అంటే అసలు చెప్పటం అక్కరనే లేదు. అసలు సినిమా అంటేనే బాహ్య ప్రంపంచాన్ని మరచిపోయి కథలో లీనమై ఆస్వాదించే అనుభూతి. అటువంటి అనుభూతి సినిమా హాల్ లో తప్ప బయట అనుభవించలేం.

కానీ ఈ ముచ్చట అంత కరోనా కి ముందు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. హాయిగా బ్రతికితే చాలు, మాయదారి జబ్బు అంటకపోతే చాలు అని అనుకునే రోజులు వచ్చేశాయి. కరోనా జబ్బు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది. చిన్న చితక వ్యాపార ల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరికి నష్టాన్ని మిగిలిచింది. ఇప్పుడిప్పుడే పలు వ్యాపార సంస్థలు కరోనాతో సహజీవనం చేస్తూ, వాటి కార్యకలాపాలను పునురుద్ధరించుకుంటున్నాయి.


దానిలో భాగంగానే సినిమా హాల్స్ కూడా 15వ తేదీ నుండి 50 శాతం ఆక్యుపెన్సీ తో తెరుచుకొనున్నాయి. అయితే సినిమా అనేది వినోదానికి సంబందించిన వ్యాపారం కాబట్టి జనాలు థియేటర్స్ కి వస్తారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న? ఇప్పుడున్న థియేటర్స్ చాలా మటుకు ఎయిర్ కండిషన్డ్ అయి ఉండడం, నాలుగు గోడల మధ్య మూసుకొని ఉండడం, గుంపు ప్రదేశం గా ఉండడం మనకు తెలిసిందే. ఇలాంటి ప్రదేశం లో పోరాటున ఎవరికైనా వైరస్ ఉండి ఉంటె వాళ్లు కూర్చున్న ప్రదేశం లోనో, లేక వాళ్లు తుమ్మినా దగ్గినా ఆ వైరస్ లోపల చల్లదనానికి మరింత వేగం గా వ్యాప్తి చెందుతుందన్న భయం జనాల్లో లేకపోలేదు . లోపలకి వెళ్ళేటప్పుడు టెంపరేచర్ టెస్ట్ చేసిన్నప్పటికీ కొంతమంది కి లక్షణాలు(అసిమ్పటోమాటిక్) లేకుండానే వైరస్ బారిన పడిన వాళ్లు ఉంటున్నారు కాబట్టి ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదొక మూల రిస్క్ వుండొచ్చని వైరస్ తగ్గే వరకు జనం గంపులుగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటమే ఉత్తమమనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఏర్పడింది.

పై కారణాలతో చాలా మటుకు జనాలు ఆన్లైన్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కొత్త సినిమాలు కూడా ఓటిటి లోనే విడుదల అవ్వటం, అన్ని భాషల కు సంబందించిన సినిమాలు ఒక్కే చోటు న అందుబాటులో ఉండడం వినియోగదారులకు కలిసొచ్చే అంశం. ఒక్కసారి ఖాతా తెరచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలను వీక్షించేందుకు వెసులుబాటు ఉండటం మరో ప్లస్ పాయింట్. ఇలాంటి క్లిష్ట తరుణం లో ఇంట్లో కూర్చుని కుటుంబం తో కలిసి ఏ ఇబ్బంది లేకూండా ఓటిటి లో సినిమా వీక్షించడమే చాలా శ్రేయస్కరం అని జనాలు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి మాములు పరిస్థితులు ఏర్పడ్డాక సినిమా హాల్స్ కి వెళ్ళి సినిమాలు చూస్తామని అది త్వరగా జరగాలని అని ఆశించే వారు అనేకం.

ఇదిలా ఉంటె కొద్దిమంది కరోనా విస్తరిస్తుంది అనే విషయాన్ని కూడా మరిచిపోయి సాధారణంగా తిరిగేస్తుండటం విచిత్రం. ఇక వినోదం, ఆహారం విషయంలో ఎలాంటి రాజీపడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా ఎలాంటి స్వంత ఆంక్షలు లేకుండా గడిపేస్తున్నారు. తాజాగా నగరంలో ప్రారంభమైన కేబుల్ వంతెనను చూడటానికి వచ్చిన సందర్శకుల సంఖ్యను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. మెజారిటీ ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నా, తాజాగా ఆలోచనా విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్తితులను చూస్తుంటే సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిండిపోవడం పెద్ద సమస్యగా తోచడం లేదు.

Article contributed by: పవన్ వఝా, సోషల్ మీడియా ఆనలిస్ట్.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here