మీకు ఎక్కడో ఒకచోట మీది కానిది అరగ్రాము బంగారం దొరికితే ఏం చేస్తారు. చాలామంది ఎవ్వరికీ తెలియకుండా దాచేసుకుంటారు. కొద్దిమంది మాత్రం నిజాయితీగా పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అలాంటిది అరకిలో బంగారం దొరికితే ఊహించండి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ సమయంలో అరకిలో బంగారం అంటే ఒక కుటుంబం ఆర్థికంగా స్థిరపడగలిగేంత విలువైనది. విశాఖపట్నంకు చెందిన అంబటి పోల రాజు అనే వ్యక్తికి ఎదురైంది ఇటువంటి సంఘటన. తాను ప్రయాణిస్తున్న బస్సులో దాదాపు రూ. 27 లక్షల విలువైన 454 గ్రాముల బంగారం బిస్కెట్లతో కూడిన సంచి దొరికింది. బంగారాన్ని చూసి షాక్‌కు గురైన రాజు రెండవ ఆలోచన లేకుండా దానిని యజమానికి అందజేసి మనసున్న మా”రాజు” అని నిరూపించుకున్నాడు.
నరసన్నపేటలో బంగారు ఆభరణాలు తయారు చేసే దుర్గారావు జూలై 24వ తేదీన 454 గ్రాముల బంగారంతో వైజాగ్ వెళ్లేందుకు బస్సు ఎక్కి మధురవాడ వద్ద దిగిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన బంగారం సంచి ఎక్కడో మరిచిపోయినట్లు గ్రహించి పోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అదే బస్సులో తన బావ శ్రీనుతో కలిసి ప్రయాణిస్తున్న పోల రాజు తన కాళ్లదగ్గర పడిన సంచి తెరిచి చూడగా దాదాపు అరకిలో బరువైన బంగారం ముక్కలు కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. సంచి పోగొట్టుకున్న ప్రయాణీకుడి కోసం వెంటనే వైజాగ్ ఆర్టీసి కాంప్లెక్స్‌కు వెళ్లినా ఆచూకీ దొరకకపోవడంతో మధురవాడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంచి అప్పగించాడు. అప్పటికే పోలీస్ స్టేషన్‌లో దుర్గారావు ఉండటంతో గుర్తుపట్టిన రాజు పోలీసుల ద్వారా బంగారం సంచిని ఆయనకు అప్పగించారు. నిజాయితీగా బంగారాన్ని అప్పగించినందుకు పోలీసులు రాజును సన్మానించి అభినందించారు. రాజు చేసిన సాయాన్ని జీవితాంతం మరచిపోలేనని, అది తన జీవితాన్ని తిరిగి నిలబెట్టిందంటూ దుర్గారావు రాజుకు ధన్యవాదాలు తెలిపాడు.