నమస్తే శేరిలింగంపల్లి: 520వ అన్నమాచార్యుల ఆరాధన సందర్భంగా చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వరకు “మహా నగర సంకీర్తన” నిర్వహించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామివారిని కన్నులపండుగగా ఊరేగించటం జరిగింది. వెంకటేశ్వర స్వామి వేషధారణలో సాందీప్, అన్నమయ్య వేషధారణలో చి. అభిరామ్ పాల్గొన్నారు. అనంతరం ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్య సంకీర్తనా కార్యక్రమం నిర్వహించారు. ప్రఖ్యాత గాయకులు రామాచారి కొమండూరు “వినరో భాగ్యము విష్ణు కథ”, వారణాసి సౌమ్య “తెలిసితే మోక్షము”, సాందీప్ “మతంగ పర్వతమాడ”, సాహితి “విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా” సంకీర్తనలతో “సంకీర్తన గోష్టి గానం” కార్యక్రమంలో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ శోభారాజు “భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ” గురించి వివరించిగా.. ప్రముఖులు కె. వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్ (రిటైర్డ్), “భక్తితో స్వీకరిస్తే త్రాగే నీరు తీర్థం అవుతుందని, తినే పదార్థము ప్రసాదం అవుతుంది” అని తమ దివ్య సందేశాన్ని అందించారు. శైలజా “అన్నమాచార్య భావనా వాహిని కోసం శోభారాజు నిర్విరామ కృషి” గురించి తెలుపుతూ తదుపరి కార్యక్రమాలు వివరించారు. ఆద్యంతం శోభారాజుతో పాటు ఆయన శిష్య బృందం “అన్నమాచార్య భావనా వాహిని” విద్యార్థులు తమ తమ సంకీర్తనలతో ఉత్తేజ పరిచారు. అతిథులుగా పాల్గొన్న వారిని, కళాకారులను డాక్టర్ శోభా రాజు , డాక్టర్ నంద కుమార్ సత్కరించారు. తదనంతరం హారతి, అల్పాహార ప్రసాద వితరణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.