నమస్తే శేరిలింగంపల్లి : అన్నమయ్యపురంలో నాద బ్రహ్మోత్సవ వేడుక మూడవ రోజు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తొలుత శోభా రాజు విద్యార్థులు విష్ణు సహస్రనామ స్తోత్రమ్, శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రమ్, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శత నామావళి, గురుస్తుతితో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు కరీంనగర్ వైద్య నిపుణులు డా. అనిల్ కుమార్ మల్పూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ప్రముఖ నేపథ్య గాయకుడు కొమండూరి రామాచారి, వారి శిష్య బృందం ఈ కార్యక్రమంలో “కంటిమి ఇన్నాళ్ళు, నిత్యులు ముక్తులు, వినవమ్మ యశోద, గోవిందాశ్రిత” అనే అన్నమయ్య సంకీర్తనలతో మధురమైన గానంతో నూతన ఉత్సాహాన్ని నింపారు. కాగా ఈ కార్యక్రమానికి తబలాపై నోవా, కీ బోర్డుపై రాజు వాద్య సహకారం అందించారు. వైద్య నిపుణులు అనిల్ కుమార్ మాట్లాడుతూ శోభారాజు సంకీర్తనలు వారి జీవితంలో ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. తమ ఇంట్లో తరచుగా శోభారాజు పాడిన అన్నమయ్య సంకీర్తనలు వినబడుతుండేవని, అవి విన్న తర్వాత ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండేదని తమ జ్ఞాపకాలు పంచుకున్నారు. అనంతరం ఏబివి సంస్థ వ్యవస్థాపకురాలు శోభా రాజు, సంస్థ అధ్యక్షులు నందకుమార్ ప్రదర్శితులకు సంస్థ ఙ్ఞాపికనిచ్చి బహుకరించారు. చివరిగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అంగనలీరే హారతులు ఇచ్చారు, పసందైన ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.