పగలు ఫుడ్ డెలివరీలు.. రాత్రి వేళల్లో చోరీలు..

  • బీటెక్ ఆపేసి చోరీలే నిలయంగా మార్చకున్న నిందితుడు అభిలాష్
  • రెండేండ్లలో 20 కేసులు
  • విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా వేసి పట్టుకున్న పోలీసులు
  • 26 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ జి. వినీత్

నమస్తే శేరిలింగంపల్లి: రెండేండ్లుగా తాళం వేసున్న ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు నేరాలే లక్షంగా మార్చుకుని కటకటాల పాలయ్యాడు. గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ జి.వినీత్ నిందితుడి వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బబ్బడి అభిలాష్ (29) బీటెక్ మధ్యలో ఆపేసి హైదరాబాద్ కి వచ్చాడు. కేపీహెచ్ బీ కాలనీ పరిధిలోని హెచ్ఎంటీ హిల్స్ లో ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.

గచ్చిబౌలిలోని కార్యాలయంలో వివరాలు వెల్లడిస్తున్న మాదాపూర్ డీసీపీ జి. వినీత్

సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో పగలు డెలివరీ బాయ్ గా చేస్తూ తాళం ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుంటున్నాడు. రాత్రి సమయంలో ఆ ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. బాలానగర్ లో ఓ స్టీల్ బోల్టు కట్టర్ ను కొనుగోలు చేసి దాని సాయంతో సులు వుగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలిసింది. పండుగలకు స్వగ్రామాలకు వెళ్లేవారు తమ విలువైన వస్తువులను బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో జమ చేసుకోవాలని, నిఘా కోసం సిసిటివిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

  • నిందితుడి చోరీల చిట్టా..
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు

రెండు సంవత్సరాలుగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 7కేసులు, మియాపూర్ పీఎస్ పరిధిలో 7, గచ్చిబౌలి పరిధిలో 4 కేపీహెచ్బీ పీఎస్ పరిధిలో రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో ఆయా పోలీస్ స్టేషన్లలో నిందితుడు అభిలాష్ పై కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పోలీసులు ఆర్టీసీ కాలనీలో విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అభిలాష్ నుంచి మొత్తం రూ.16 లక్షల విలువ జేసే 26 తులాల బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని డీసీపీ వినీత్ తెలిపారు. ఈ సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహారావు, సీఐ ప్రేమ్ కుమార్, డీఐ కాంతారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here