- వ్యక్తి నుంచి రూ.20వేలు డిమాండ్, భయపడి రూ.16,500 ఇచ్చిన బాధితుడు
- పోలీసులకు ఫిర్యాదు, హిజ్రాలను గాలించి పట్టుకున్న బాచుపల్లి పోలీసులు
- 7 సెల్‌ఫోన్లు, రూ.16,500 నగదు స్వాధీనం
- వేధింపులకు గురి చేస్తే సమాచారం ఇవ్వండి: సైబరాబాద్ పోలీసులు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలను వేధింపులకు, భయభ్రాంతులకు గురి చేస్తూ వారి నుంచి డబ్బులను దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని వేధింపులకు గురి చేసి అతని నుంచి డబ్బులు వసూలు చేసిన కొందరు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాచుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం ప్రగతినగర్ ప్రాంతం ఆర్‌కే లే అవుట్‌లో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి పంచాంగం చలపతి ఈ నెల 24వ తేదీన తన కుమారుడికి పెళ్లి చేశాడు. మరుసటి రోజు.. అంటే 25వ తేదీ ఉదయం 5 గంటలకు ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అయితే అదే సమయానికి 10 మంది హిజ్రాలు అతని ఇంటికి చేరుకుని రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు చలపతి నిరాకరించాడు. దీంతో ఆ హిజ్రాలు చలపతిని, అతని కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారు. అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులను తొలగించి నగ్నంగా కనిపించారు. ఈ క్రమంలో భయం చెందిన చలపతి వారికి రూ.16,500 ఇచ్చాడు. అనంతరం ఆ హిజ్రాలు అక్కడి నుంచి ఆటో (టీఎస్15యూడీ0298)లో వెళ్లిపోయారు.
కాగా హిజ్రాల ప్రవర్తన పట్ల భయ భ్రాంతులకు గురైన చలపతి అదే రోజు ఉదయం 6 గంటలకు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు హిజ్రాల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసులు అదే రోజు ఉదయం 8 గంటల సమయంలో ప్రగతి నగర్‌లోని ఏలీప్ ఎక్స్ రోడ్డు వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చేసిన నేరం అంగీకరించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7 మొబైల్ ఫోన్లు, రూ.16,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.
కాగా అరెస్టయిన వారిలో సాక్షి అలియాస్ సహానా, మల్కాపూర్ రాయేష్, మునావత్ రాకేష్ అలియాస్ సావిత్రి, రాములు గగనం, కప్పెర బాబయ్య, తూరపాటి నరసింహులు, తూరపాటి లింగం, తూరపాటి యాదయ్య, ఆటో డ్రైవర్లు కరణ్ గుప్తా, మహమ్మద్ మాసిలు ఉన్నారు. వీరందరూ చలపతి నుంచి రూ.16,500 తీసుకున్నట్లు అంగీకరించారు. కాగా ముందు రోజు రాత్రే వీరు చలపతి ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సమాచారం తెలుసుకుని పక్కాగా అతని ఇంటికి వెళ్లి అతని నుంచి డబ్బులను వసూలు చేశారని అన్నారు. అయితే వీరు ఇలాగే శుభ కార్యాలు, ఇతర కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు, వాటి వివరాలను ముందుగానే సేకరిస్తారని, అనంతరం కార్యక్రమం జరిగే సమయానికి ప్రత్యక్షమై డబ్బులను డిమాండ్ చేస్తారని పోలీసులు తెలిపారు. వీరికి ఇదే అలవాటుగా మారిందన్నారు.
కాగా ఈ కేసు విషయమై పోలీసులు ప్రజలకు సూచనలు చేశారు. ఎవరైనా సరే ఇలా వేధింపులకు గురిచేస్తూ, భయ పెడుతూ డబ్బులను వసూలు చేయాలని చూస్తే వెంటనే డయల్ 100లో పోలీసులను సంప్రదించాలని లేదా 9490617444 అనే నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని పోలీసులు తెలిపారు.