నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే శుక్రవారం నుంచి ఆ రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. ఇందుకు గాను స్లాట్ బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు స్లాట్లను బుక్ చేసుకుంటుండడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ల వద్ద జనాలు అవస్థలు పడుతున్నారు.
దాదాపుగా 95 రోజుల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జనాలు ఉదయం 10.30 గంటల నుంచి స్లాట్లను బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్లాట్ బుకింగ్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్న క్రయ విక్రయదారులు ఉసూరుమంటూ వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి వస్తుందని అధికారులకు ముందుగా తెలియదా.. అంటూ వారిపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.