పటాన్‌చెరు (నమస్తే శేరిలింగంపల్లి): పటాన్‌చెరు పట్టణంలోని జాతీయ రహదారి పక్కన వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. జీహెచ్ఎంసీ, నేషనల్ హైవే అథారిటీ, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం జేసీబీలతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. జాతీయ రహదారిపై అక్రమంగా నిర్మాణాలను చేపడితే ఎంతటి వారిపైనైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు ఈ సందర్బంగా హెచ్చరించారు.
ఐతే పటాన్‌చెరులోని జాతీయ రహదారి పక్కన కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని వార్త విలేకరి సంతోష్ నాయక్ ఇటీవల ఓ ప్రత్యేక కథనం రాశాడు. అందులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన అనుచరులే ఆ నిర్మాణాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ కథనంపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సదరు విలేకరి సంతోష్ నాయక్‌కు ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరించిన విషయం విధితమే. అయితే దీనిపై సంతోష్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్టులు కదం తొక్కారు. ఈ క్రమంలో పటాన్‌చెరు జాతీయ రహదారి పక్కన వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంతోష్ నాయక్ రాసిన వార్త కథనంలో వాస్తవం లేదని, అసలు ఆక్రమణలే జరుగలేదని పేర్కొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, అతని అనుచరులకు ఈ కూల్చివేతలతో ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది.
Super