శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు టి. రామకృష్ణ మాట్లాడుతూ.. అహింస, సత్యం, శాంతి, మతసామరస్యం వంటి గొప్ప విలువలతో మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర్య పోరాటానికి మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. తీవ్రవాదం కన్నా మతోన్మాదం సమాజానికి మరింత ప్రమాదకరమని టి. రామకృష్ణ పేర్కొన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, కులమతాల పేరుతో సమాజాన్ని విభజించడం దేశ ఐక్యతకు, లౌకిక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని అన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మహాత్మా గాంధీ కలలుగన్న శాంతియుత, సమానత్వ భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన లౌకిక విలువలను కాపాడుకోవాలని ఆయన అన్నారు. గాంధీ ఆశయాలను ఆచరణలో పెడుతూ మతోన్మాదం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గాంధీ స్ఫూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం.. లౌకిక భారతదేశాన్ని కాపాడుకుందాం అని టి. రామకృష్ణ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీహెచ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.





