కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్, సుభద్ర అనే దంపతులకు చెందిన కుమార్తెలు గీత, హర్షిత, కుమారుడు సుమంత్ ల ఉన్నత చదువుల కోసం ఎమ్మెల్యే గాంధీ తన సొంత ఖర్చుతో కాలేజీ ఫీజులు చెల్లించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. గీత వీజేఐటీ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను, హర్షిత సెయింట్ మేరీస్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం, సుమంత్ నారాయణ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారని, అందుకు గాను ముగ్గురికి అయ్యే కాలేజీ ఫీజుల నిమిత్తం రూ.1,06,600 లను చెక్కు రూపేణా అందజేశామని తెలిపారు. అలాగే ఆ విద్యార్థులకు ఇక ముందు కూడా అండగా ఉంటామని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా ఆదుకుంటామని తెలిపారు. వారిని సొంత పిల్లల్లా చూసుకుంటానని, వారిని తానే చదివిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలని, వారికి ఎప్పుడు ఏ సహాయం అవసరం అయినా అందజేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.