అలీ తలాబ్ కాలుష్యంపై ఆందోళన.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వినతి..

శేరిలింగంపల్లి, మే 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) MCPI(U) హైదర్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అలీ తలాబ్ చెరువు కాలుష్య సమస్యపై ఆల్విన్ కాలనీ సర్కిల్ ఉప కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. చెరువు కాలుష్యాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని డివిజన్ కన్వీనర్ ఇక్రాన్ షేక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలీ తలాబ్ చెరువు చుట్టూ ఇప్పటికే ఎస్టీపీ (STP) లైన్ ఏర్పాటు చేసినప్పటికీ, కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మురుగు నీరు నేరుగా చెరువులోకి చేరుతోందని ఆరోపించారు. దీంతో చెరువు పూర్తిగా కలుషితమైందని తెలిపారు. చెరువు పరిసర 500 మీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

చెరువు నీరు స్నానం చేయడానికి, కాళ్లు కడుక్కోవడానికి కూడా పనికిరాని స్థితికి చేరుకుందని, దుర్వాసనతో స్థానిక ప్రజలు మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో జీవిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఇప్పటికే నిర్మించిన ఎస్టీపీ లైన్‌కు మురుగు నీటిని అనుసంధానం చేసి, చెరువులోకి డ్రైనేజీ నీరు చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, రవి, గిరి, ముస్తఫా, శ్యామ్ గౌడ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here