శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి):వేంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ చాముండేశ్వరీ అనుగ్రహ పీఠాధిపతి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సుమారు 200 మంది మహిళలకు చీరలు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సేవ చేయాలని, నేడు చేసే సేవ భావితరాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత సమాజంలో ధార్మిక సంస్థలు సేవా కార్యక్రమాల ద్వారా విశేషంగా ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, అలాంటి సేవలను ఎన్నో సంవత్సరాలుగా శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి కొనసాగిస్తున్నారని కొనియాడారు. యువత కూడా మహర్షి మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సీవీ రామన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహేంద్రవాడ వెంకటేశ్వర అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడతాయని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు మంచి మార్గంలో ముందుకు సాగుతారని అన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మందికి పైగా పేద మహిళలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కోట రాజేశ్వరి, భానుమతి తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, రాజ్యశ్రీ, పాపిరెడ్డి నగర్ బస్తీ అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి, పోతుల రాజేందర్, చెర్ల సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి నర్సింహులు, తాటి కిరణ్, వనం ఆంజనేయులు, మాదాసు అనంత రాములు, సత్యనారాయణ, శ్రీకాంత్, లక్ష్మీ, అరుణ, సులోచన, మణమ్మ తదితరులు పాల్గొన్నారు.





