శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): జనగణనలో కులగణనను శాస్త్రీయంగా, విశ్వసనీయంగా నిర్వహించాలంటే దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్ కేటాయించాలని బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో జనగణనలో కులగణన – మళ్లీ మోసపోతున్న బీసీలు అంశంపై శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. ఈ సందర్భంగా బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు (ఐఏఎస్ రిటైర్డ్) మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జనగణన తొలి దశ హౌస్ లిస్టింగ్ పూర్తయిందని, ప్రస్తుతం రెండో దశ జనాభా గణన ప్రశ్నావళిపై 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జూలై 6 నుంచి 18 వరకు ప్రీ-టెస్టింగ్ జరుగుతోందన్నారు.

ప్రీ-టెస్టింగ్‌లో ఎస్సీ, ఎస్టీలకు ముందుగానే కేటాయించిన యూనిక్ కోడ్‌ల ఆధారంగా వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ, మిగతా కులాల విషయంలో ఓపెన్-ఎండెడ్ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన విధంగానే కులాల పేర్లు నమోదు చేయడం వల్ల ఒకే కులం వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో నమోదై డూప్లికేషన్, మల్టిప్లికేషన్ జరిగి కులగణన విశ్వసనీయత దెబ్బతింటుందని పేర్కొన్నారు. 2011 సామాజిక-ఆర్థిక కులగణన (SECC)లో యూనిక్ కోడ్‌లు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 42 లక్షల కులాల పేర్లు నమోదయ్యాయని, 2014 తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఇదే సమస్య ఎదురైందని గుర్తు చేశారు. అయితే 2024 తెలంగాణ సామాజిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ప్రతి కులానికి కోడ్‌లు కేటాయించడం వల్ల శాస్త్రీయంగా వివరాలు నమోదు చేయడం సాధ్యమైందని, బీహార్ కులగణనలోనూ ఇదే విధానం అమలైందని వివరించారు.

అందువల్ల దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించి, అదే ఆధారంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 2011 తరహాలోనే ఈ కులగణన కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే 2011 జనగణనలోని 29 ప్రశ్నల షెడ్యూల్‌ను యథాతథంగా కొనసాగించకుండా, సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే కొత్త ప్రశ్నలను చేర్చి ప్రశ్నావళిని సవరించాలని కోరారు. తుది ప్రశ్నావళిని ఖరారు చేసే ముందు ప్రజా సంఘాలు, నిపుణులు, బీసీ సంస్థలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖను విడుదల చేశారు.
ఆల్ ఇండియా బీఎస్పీ కన్వీనర్, మాజీ డీజీపీ పూర్ణచందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు దశాబ్దాలుగా బీసీలను మోసం చేస్తున్నాయని, ప్రస్తుత కులగణన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు. కులగణనను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు మాట్లాడుతూ బీజేపీకి చెందిన బీసీ ఎంపీలు వెంటనే స్పందించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరారు. ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించేలా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ కులగణన శాస్త్రీయంగా, వృత్తిపరమైన ప్రమాణాలతో జరగాలంటే యూనిక్ కోడ్ వ్యవస్థ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ సమావేశానికి దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్ గౌడ్, ఎర్రమాద వెంకన్న, చెన్న శ్రీకాంత్, సింగం నాగేశ్వర్ గౌడ్, కొండల్ గౌడ్, లింగేశ్ యాదవ్, జెల్ల నరేందర్, భిక్షపతి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.





