శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): పాదచారులకు సురక్షితమైన, నిరంతరాయమైన నడక మార్గాలను అందించాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) మూడు జోన్లలో ఒకేసారి వాక్ ఫ్రీ (WALK FREE) – ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కార్పొరేషన్ కమిషనర్ సృజన ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో జోనల్ కమిషనర్లు, సర్కిల్ అధికారులు, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సమన్వయంతో పనిచేసి ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. దీంతో పాదచారులకు సురక్షితమైన నడక మార్గాలను పునరుద్ధరించారు.

జోన్ల వారీగా పరిశీలిస్తే శేరిలింగంపల్లి జోన్ పరిధిలో 5 రహదారి విభాగాల్లో 9.86 కిలోమీటర్ల మేర డ్రైవ్ నిర్వహించి 193 ఆక్రమణలను తొలగించారు. కూకట్పల్లి జోన్ లో 3 రహదారి విభాగాల్లో 3.50 కిలోమీటర్ల మేర 89 ఆక్రమణలను తొలగించగా, కుత్బుల్లాపూర్ జోన్ లో 7 రహదారి విభాగాల్లో 8.92 కిలోమీటర్ల మేర నిర్వహించిన డ్రైవ్‌లో 206 ఆక్రమణలను తొలగించారు. మొత్తం మూడు జోన్లలో 15 రహదారి విభాగాల్లో చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 22.28 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను ఆక్రమణల నుంచి విముక్తం చేసి, మొత్తం 488 ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ ఫుట్‌పాత్‌లు పూర్తిగా పాదచారుల కోసమేనని, వాటిపై ఎలాంటి ఆక్రమణలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నడక మార్గాలను కల్పించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఫుట్‌పాత్‌లను ఆక్రమణల రహితంగా ఉంచేందుకు ప్రజలు, వ్యాపారులు, వాణిజ్య సంస్థలు సహకరించాలని కార్పొరేషన్ విజ్ఞప్తి చేసింది. స్వేచ్ఛగా నడవండి, సురక్షితంగా చేరండి, అందమైన ప్రజా ప్రదేశాలను కలిసి నిర్మిద్దాం అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించింది.





