శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని DLF ప్రాంతంలో ప్రజా స్థలాలను ఆక్రమణల నుంచి విముక్తం చేసేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా నిర్మించిన కట్టడాలు, అడ్డంకులను తొలగించారు. ప్రజలకు చెందిన ఖాళీ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంతోపాటు పాదచారులు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టారు. ఆక్రమణల తొలగింపుతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, సురక్షితమైన ప్రజా ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ప్రజా ప్రదేశాలను పరిశుభ్రంగా, సురక్షితంగా, ఆక్రమణలు లేకుండా ఉంచేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టుబడి ఉందని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పేర్కొన్నారు. ప్రజా స్థలాలు అందరివని, వాటి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





