శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర వాషర్మెన్ (రజక) కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దాసరిరాజు అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా సీఎంను కలిసిన అజయ్ కుమార్కు ముఖ్యమంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వాషర్మెన్ సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కార్పొరేషన్ ద్వారా అమలు చేయాల్సిన పథకాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ బలోపేతానికి అవసరమైన అన్ని చర్యల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాసరిరాజు అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల తరువాత తొలిసారిగా వాషర్మెన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రజక సమాజం తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.

వాషర్మెన్ సమాజ హక్కుల పరిరక్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, జీవో 102 అమలు, యువత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన ప్రోత్సాహం తనకు మరింత బాధ్యతను గుర్తు చేసిందన్నారు. సామాజిక న్యాయం, బీసీ వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తన నియామకం ఆ దిశగా కీలక అడుగని అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వాషర్మెన్ కుటుంబాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.





