శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి తండాలోని బృందావన్ కాలనీలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో ఆంజనేయ స్వామి, శివాలయం, నాగదేవత, నవగ్రహాల విగ్రహ ప్రతిష్ఠాపనతోపాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, నూతన దేవాలయాల నిర్మాణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రజల్లో దైవభక్తిని పెంపొందించడంలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతోపాటు సామాజిక ఐక్యతను బలోపేతం చేసే కేంద్రాలుగా ఆలయాలు నిలుస్తాయని చెప్పారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రజలందరూ ఐకమత్యంతో సహకరించాలని ఆయన కోరారు. గచ్చిబౌలి డివిజన్లో ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు, నాగదేవత, నవగ్రహాల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, సుమన్, రంగస్వామి, దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





