శేరిలింగంపల్లి, జూలై 9 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న నిర్వహించనున్న కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు (AIFDS–AISF–SFI) ఆధ్వర్యంలో గురువారం చందానగర్‌లో భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించారు. దీప్తి శ్రీనగర్ నుంచి మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు విద్యార్థులు భారీగా పాల్గొని ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, హాస్టళ్లలో దయనీయ పరిస్థితులు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల భారం, మహిళా విద్యార్థుల భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతంపై దృష్టి పెట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల విలీన ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. AIFDS, AISF, SFI నాయకులు ముత్తన్నగారి శ్రీకాంత్, ధర్మా, తేజ, బేగరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలహీనపరిచే విధానాలను విరమించుకోవాలని కోరుతూ జూలై 10న జరిగే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని, హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, మహిళా విద్యార్థుల భద్రత కోసం ప్రతి విద్యాసంస్థలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ–2020) అమలును నిలిపివేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, జిల్లా నాయకుడు ముత్తన్నగారి శ్రీకాంత్, అరుణ్, AISF నాయకులు ధర్మా, తేజ, నితీష్, SFI రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్, నాయకులు మాల చందు, సాయి కిరణ్, రేవంత్, ఈశ్వర్ రెడ్డి, జె.డి. గణేష్, శ్రీరామ్, దుర్గాప్రసాద్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.





