శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ పాల్గొనడం అభినందనీయమని ఏఐఎస్ఎఫ్ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమితి అధ్యక్షుడు టి. నితీష్ ధర్మ తేజ అన్నారు. విద్య హక్కు పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతం, విద్యార్థులపై పెరుగుతున్న ఆర్థిక భారం తగ్గింపు, విద్యా రంగంలోని సమస్యల పరిష్కారం వంటి ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు విశేష సహకారం అందించారని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన బంద్‌ను విజయవంతం చేసిన విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలకు ఏఐఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేసిన టి. నితీష్ ధర్మ తేజ, ప్రభుత్వం వెంటనే విద్యా రంగ సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.





