శేరిలింగంపల్లి, డిసెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం తాగవద్దని వారించినందుకు భార్యతో గొడవపడ్డ ఓ భర్త ఆమె తలపై చేత్తో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమెను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొంచెపు రారాజు, విజయలక్ష్మి దంపతులకు 14 ఏళ్ల కిందట వివాహం కాగా వీరికి ఇద్దరు కుమారులు కలిగారు. ఈ క్రమంలోనే రారాజు మద్యానికి బానిసగా మారి తరచూ విపరీతంగా తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో ఆ అలవాటును మానుకోవాలని భార్య విజయలక్ష్మి అతనికి తరచూ చెబుతుండేది. అయితే భార్య మాటలను లెక్క చేయని రారాజు ఆమెతో ఈ విషయంపై తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రారాజు తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు తన భార్య విజయలక్ష్మితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా వారు మరోమారు గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన రారాజు తన చేత్తో విజయలక్ష్మి ముఖంపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు అంతర్గతంగా తీవ్ర గాయాల పాలైన విజయలక్ష్మి వెంటనే స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను రారాజు సమీపంలోని కేపీహెచ్‌బీలో ఉన్న రవి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించాడు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విజయలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించి ఆమె బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






