శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర జనగణనలో బీసీల కులగణనకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడారు. అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బాల్‌రాజ్ గౌడ్ మాట్లాడుతూ, 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. హడావుడిగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, ఒక్కరోజులోనే నామినేషన్లు స్వీకరించడం బీసీల గొంతు కోయడమేనని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి బీసీలపై కుట్ర చేస్తున్నాయని, ఈ కుట్రలను ప్రజాక్షేత్రంలో బహిర్గతం చేసి అన్ని పార్టీల భరతం పడతామని హెచ్చరించారు. మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలకు నిజంగా రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశమే లేదని ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని, బీసీల సాధికారతపై చిత్తశుద్ధి లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీసీలు పెద్దఎత్తున పోటీ చేసి బహుజన వాదాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్లు ఎల్లికట్టే విజయ్ కుమార్ గౌడ్, బైరు శేఖర్, అంబాల నారాయణ, నాగభూషణ్, చెన్న శ్రీకాంత్, దామోదర్ గౌడ్, గోలి యాదగిరి, లింగేష్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.





