శేరిలింగంపల్లి, జనవరి 16 (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం మత్తులో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఇద్దరికి తీవ్ర గాయాలు అయి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 16వ తేదీ ఉదయం 9:30 గంటల సమయంలో బోడ వెంకన్న (52) అనే వ్యక్తి తన హుండాయ్ ఐ10 కారు (టీఎస్09ఇ08134)లో కేపీహెచ్‌బీ నెక్సస్ మాల్ నుంచి మియాపూర్ గోకుల్ ప్లాట్స్ వైపు ప్రయాణం చేస్తున్నాడు. అప్పటికే అతను పీకల దాకా మద్యం సేవించి తీవ్రమైన మత్తులో ఉన్నాడు. ఈ క్రమంలో అతను మార్గమధ్యలో తన కారుతో రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టాడు. మొదటి ఘటనలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని వెంకన్న గోకుల్ ఎక్స్ రోడ్డుకు వెళ్తుండగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. మళ్లీ వెంటనే ఇంకో చోట ఇంకో ఘటనలో తన కిరాణా షాపు వద్ద రోడ్డు దాటుతున్న మాధవ రావు అనే వ్యక్తిని కూడా వెంకన్న తన కారుతో ఢీకొట్టాడు. దీంతో మాధవ రావుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కాగా వెంకన్న మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.





