శేరిలింగంపల్లి, డిసెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నంబర్ 1 సమీపంలో ఈ నెల 23వ తేదీన అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ వయస్సు సుమారుగా 45 నుంచి 50 ఏళ్లు ఉంటుందని, ఆమె పసుపు, తెలుపు రంగుతో కూడిన బ్లాంకెట్ కప్పుకుని ఉందని, జుట్టు కట్ చేయబడి ఉందని, ఎత్తు 5.2 అడుగులు ఉంటుందని, చామనఛాయ రంగులో ఉంటుందని, నలుపు రంగు స్వెటర్ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె చుట్టు పక్కల బహుశా భిక్షాటన చేస్తూ ఉండవచ్చని, ఆహారం సరిగ్గా తినకపోవడం, చలి, అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమను సంప్రదించాలని సూచించారు.






