హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి షెడ్యూల్ ను విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021 ఫిబ్రవరితో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలక వర్గం గడువు ముగుస్తుందన్నారు. 2016 నాటి రిజర్వేషన్ల ప్రకారమే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించనున్నామని తెలిపారు. పటిష్ట బందోబస్తు నడుమ కోవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలను నిర్వహిస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఓటర్ల తుది జాబితాపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పోలీసు అధికారులు బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారన్నారు. 150 డివిజన్లలో ప్రతి డివిజన్‌కు రిటర్నింగ్ అధికారి ఉంటారన్నారు.
ఈవీఎంలపై అభ్యంతరాలు వచ్చినందునే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని, బ్యాలెట్ పేపర్ రంగు తెలుపులోనే ఉంటుందని, జనవరి 2020 నాటికి 18 సం.లు నిండిన వారికి ఓటు హక్కు ఉంటుందని తెలిపారు.
ఈ నెల 18 నుంచి 20వ తేదీ మధ్యలో నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. 21న నామినేషన్లను పరిశీలిస్తామని, 22న నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందని, తరువాత అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. డిసెంబర్ 1న పోలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచినట్లు తెలిపారు. అందువల్ల పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. డిసెంబర్ 4వ తేదీన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్లను లెక్కిస్తామని తెలిపారు.
జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూలు ప్రతిపక్ష పార్టీలను అయోమయంలో పడవేసింది. నామినేషన్లు మొదలు ఓటింగ్ వరకు సమయం తక్కువ ఉండటంతో ప్రతిపక్ష పార్టీలు ఇరుకున పడ్డాయి. అధికార పార్టీ అభ్యర్థుల జాబితా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి. మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయడం ప్రతిపక్షాలకు ప్రాణసంకటంగా మారిందనడంలో సందేహం లేదు.