నమస్తే శేరిలింగంపల్లి : సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంటి ముదిరాజ్ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కు, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు కు చంటి ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు.
అధికారుల్లో జవాబుదారితనం కొరవడిందన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు. నిర్ణీత సమయంలోపు అందించకపోతే అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. ఇక్కడా స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు. కమిషన్ స్పందించి సంబంధిత అధికా రులపై చర్యలు తీసుకుంటుందన్నారు.సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ, అధికారికి లేదన్నారు. సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి బయటకు తీస్తూ సమాచార హక్కు చట్టం గురించి పౌరులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు, నంగునూరు మండల అధ్యక్షులు అశోక్ యాదవ్,గుండెల రాయుడు, బోదాస్ జగన్, ఎం.డి మున్న, జి.భాను ప్రసాద్, వెంకటేష్ యాదవ్, నమిండ్ల హరీష్, పాల్గొన్నారు..