శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్‌మోహర్ పార్క్, నేతాజీ నగర్, డాక్టర్స్ కాలనీలలో రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా గుల్‌మోహర్ పార్క్ కాలనీలో రూ.45 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, నేతాజీ నగర్‌లో రూ.25 లక్షలతో నాలాపై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, డాక్టర్స్ కాలనీలో రూ.50 లక్షలతో పార్కు ప్రహరీ గోడ, వాకింగ్ ట్రాక్, ఇంకుడు గుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాలనీల్లోని పార్కులను సుందరంగా తీర్చిదిద్ది వాకింగ్ చేసేవారికి, వృద్ధులు సేదతీరడానికి, పిల్లలు ఆడుకోవడానికి అనువైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానిక మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.





